ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేసం పార్టీ గుప్పించిన హామీలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య విజ్ఞప్తి చేశారు. మంత్రులు హామీలు ఇవ్వరాదని, ప్రజాకర్షక పథకాలు ప్రకటించరాదని చెబుతున్న ఈసీ.. తెదేపా అధినేత చంద్రబాబు గుప్పిస్తున్న హామీలను కూడా ఒకసారి పరిగణంలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ విషయమై గురువారం రోశయ్య మాట్లాడుతూ కలర్ టీవీలు ఇస్తామనడం, ఆయా వర్గాల వారికి రూ.2000, రూ.1500, రూ.1000 చొప్పున నెలవారీ భృతిగా ఇస్తామనడం, నిరుద్యోగ భృతిని ప్రకటించడం ఇవన్నీ జనాకర్షక పథకాలు కావా అంటూ ప్రశ్నించారు. మహిళలకు పింఛన్లు ఇస్తామంటున్న తెదేపా ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
తాము ప్రకటించిన అభయహస్తానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు తన పథకాన్ని ప్రకటించారా చెప్పాలంటూ ఆయన కోరారు. తెదేపా ఇస్తామంటున్న టీవీలు ప్రజల మేథస్సు పెంచడానికా, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికా చెప్పాలంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు జనాకర్షక పథకాలు వద్దని, కాంట్రాక్టు ఉద్యోగులే ఉపయోగకరమని, పంచాయతీకి నిధులు అవసరం లేదని తన మనసులో మాట పుస్తకంలో పేర్కొన్న చంద్రబాబు నేడు ప్రజాకర్షక పథకాలు గుప్పించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. |