తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే తెలంగాణ ఇవ్వడంతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామంటూ బీజేపీ ప్రకటించింది. దీంతోపాటు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలిస్తామని కూడా ఆ పార్టీ పేర్కొంది. అలాగే గంగా, కావేరీ నదులను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని బీజేపీ ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీతో సహా, టీడీపీ, పీఆర్పీలపై ధ్వజమెత్తారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలదాకా పద్దతి ప్రకారం మౌళిక వసతులు కల్పించామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా తలకిందులైందని విమర్శించారు.
గడిచిన ఐదేళ్లలో దేశంలో ఉగ్రవాదం, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 57 ఏళ్లు కాంగ్రెస్ దేశాన్ని పాలించిందని అయితే ఇంకా రైతుల ఆత్మహత్యలు ఆగిపోలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రకటించిన కలర్‌టీవీల పథకంపైనా విమర్శలు గుప్పించారు.
ప్రజలు మంచినీళ్లు లేకుండా అల్లాడుతుంటే కలర్ టీవీలు, ఫ్రిజ్‌లు ఇస్తామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. మౌళిక వసతులు కల్పించిన తర్వాత కలర్ టీవీలు ఒకటి కాకుంటే రెండు ఇవ్వండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. |