మహిళల మనసు తమకు మాత్రమే తెలుసునని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల మనసు తెలుసు కాబట్టే తాము ఉచితంగా టీవీలు అందిస్తామని ప్రకటించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాంగ్రెస్, పీఆర్పీలు సైతం టీవీలు ఇవ్వాలని అనుకున్నాయని అయితే తాము ఆ పథకాన్ని ప్రకటించేసరికి ఆ పార్టీలు తెగ బాధపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి మహిళలను పార్టీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని అయితే వారు తమ కష్టాలను ఎవరితోనూ చెప్పుకోరని ఆయన అన్నారు. అందుకే వారి కష్టాలు తీర్చాలనే వెయ్యి నుంచి రెండువేల రూపాలయ వరకు నగదు రూపంలో నేరుగా వారికే అందే పథకాన్ని తాము ప్రకటించామన్నారు.
అలాగే మహిళలే ఎక్కువగా టీవీ చూస్తారని సీరియళ్లు, వినోదంతో పాటు ఆరోగ్య కార్యక్రమాలు కూడా చూస్తారని అందుకే మహిళల మనసెరిగి తాము కలర్ టీవీల పథకం ప్రకటించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిని పరిశ్రమకు సంబంధించిన మహిళలతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. |