రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి. యాదవ్‌పై చర్యతీసుకోవాలని మహాకూటమి నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డిపైనా చర్య తీసుకోవాల్సిందిగా మహాకూటమి ఈసీని కోరింది. ఈ విషయమై మహాకూటమి నేతలు ఈసీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ డీజీపీ యాదవ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో పదవి కట్టబెట్టిన కారణంగానే ఆయన ప్రభుత్వ అనుకూల వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి ఇవ్వలేదనే ఆయనకు తమపై కోపం అని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిని పొగుడుతూ కొద్దిరోజుల క్రితం డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు. డీజీపీకి ఎన్నికల సంఘం అంటే గౌరవం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో తమ ఫోన్లు ట్యాఫింగ్ చేయబడుతున్నాయని తాము ఫిర్యాదు చేస్తే డీజీపీ తమపైనే విమర్శలు చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
డీజీపీ ఇప్పటికీ రాజకీయ నేతలాగే మాట్లాడుతున్నారని అదేసమయంలో ఇప్పటికీ తమ ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా నిబంధనలు అతిక్రమిస్తున్న డీజీపీపై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. |