తెలుగు వెండితెర హీరోలు రాజకీయాల్లో ఒకటయ్యారు. వారిలో ఒకరు మెగాస్టార్. మరొకరు రెబల్ స్టార్. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆలరించిన ఈ స్టార్లు ఇకపై ప్రజా సేవ కోసం రాజకీయ తెరపై చేతులు కలిపారు. హైదరాబాద్‌లోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీఆర్పీలోకి కృష్ణంరాజును సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజులు మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చాయని, ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ సేవ చేసేందుకు వచ్చారని, అదే ఆశయంతో తాను కూడా ప్రజారాజ్యంలో చేరినట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీలో ఉంటూ వచ్చిన తాను ఆశించిన స్థాయిలో సేవ చేయలేక పోయానని అందువల్లే వేరే పార్టీలోకి చేరినట్టు చెప్పారు.
అవసరమైతే, పార్టీ ఆదేశిస్తే చిరంజీవితో కలిసి గానీ లేదా ఒంటిరిగా కానీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని కృష్ణంరాజు వెల్లడించారు. ఆ తర్వతా చిరంజీవి మాట్లాడుతూ.. పార్టీ తొలి జాబితాను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. తమ పార్టీలో కోవర్టులు లేరనే తాము భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కృష్ణంరాజుకు నర్సాపురం లేదా విశాఖ లోక్‌సభ సీట్లను కేటాయించే అవకాశం ఉంది. |