చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో అసమ్మతి సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇవ్వలేదని కొందరు పార్టీని వీడిపోతుంటే, పార్టీలో తమ మాటకు విలువ ఇవ్వడం లేదంటూ కొందరు సీనియర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించడానికి ముందునుంచే చేదోడు వాదోడుగా ఉన్న సీనియర్ నేత పరకాల ప్రభాకర్ సైతం ప్రజారాజ్యం వీడిపోయేందుకు నిర్ణయించారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్న పరకాల ప్రభాకర్ గురువారం ప్రజారాజ్యంను వీడడానికి సంబంధించి అధికార ప్రకటన చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ వ్యవహారశైలిపై గత కొన్నిరోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యాలయానికి సైతం రావడం లేదని కొందరు చెబుతున్నారు. పార్టీలో తన మాటకు విలువలేకపోవడం, అల్లు అరవింద్ నియంతృత్వ ధోరణి, మరికొందరు నేతల అజమాయిషీ నచ్చకే పరకాల ప్రజారాజ్యానికి దూరం కావాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పరకాల రాజీనామా గురించి గురువారం మధ్యాహ్నం స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. |