ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పరకాల ప్రభాకర్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. లోక్‌సభ టికెట్ లభించలేదన్న అసంతృప్తితో పాటు, పార్టీ నాయకుడు వెంకట రమణారెడ్డి (దాము) భార్యకు పార్టీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో తీవ్ర మనస్థాపానికి గురైన పరకాల పార్టీకి స్వస్తి పలికారని పార్టీశ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఈ నేపథ్యంలో.. గురువారం తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయ సిబ్బందికి పరకాల అందజేశారు. పరకాలను రాజీనామా చేయవద్దని అల్లు అరవింద్ బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫలితంగా.. పరకాల తన రాజీనామా లేఖను "ప్రజారాజ్యం నుంచి నేను వైదొలగుతున్నాను, నా రాజీనామాను ఆమోదించాలనే" రెండే రెండు వ్యాఖ్యలతో మాత్రమే సమర్పించారు.
ఇదిలా ఉండగా.. దాము మరణించిన సమయంలో పార్టీ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరైన పరకాల కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజక వర్గం స్థానాన్ని ఆ కుటుంబ సభ్యులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని ప్రరాపా పట్టించుకోకుండా, పార్టీ నాయకుల వద్ద తనను చిన్న బుచ్చారనే ఆవేదనతోనే పరకాల పార్టీని వీడినట్లు పార్టీ శ్రేణుల సమాచారం.
మరోవైపు.. ప్రజారాజ్యం పార్టీ కన్వీనర్ సంకురాత్రి రామారావు పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. |