ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాగుల్ గాంధీ శుక్రవారం కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. మైలవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ...అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వాలు పటిష్టవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాయని ఆయన తెలిపారు.
దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియడంకోసం తమ ప్రభుత్వం సమాచార హక్కు చ్టటం తీసుకువచ్చిందని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. దీనివలన ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలు అన్నీకూడా తెలుసుకునే వీలును తాము కల్పించామని, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
మనందరికి పట్టెడన్నం పెట్టే రైతన్నలు తమ రక్తాన్ని స్వేదంగా మార్చి పంటలు పండిస్తున్నారని దీంతో వారు ఆరోగ్య పరంగానే కాక ఆర్థికపరంగాకూడా చాలా నష్టపోతున్నారని ప్రత్యేకంగా వీరికోసం తమ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసిందని, ఇది దాదాపు అరవై వేల కోట్ల రూపాయలవరకు రుణ మాఫీ చేసామని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా నిరుపేదలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్న లక్ష్యంతోనే ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టాయని, ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని ఇది మన దేశంలోనే తొలిసారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. |