ప్రజారాజ్యం పార్టీ రైలు యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. తమ పార్టీకి రైలింజన్ గుర్తు వచ్చినందున, ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకుని వెళ్లే దిశగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నామని ఆ పార్టీ అధినేత చిరంజీవి మీడియా ప్రతినిధులతో అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైలు యాత్రలో తనతో పాటు సోదరుడు పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరు అన్నారు. రైలింజన్ సామాజిక న్యాయానికి లభించిన గుర్తు అని మెగాస్టార్ తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యంగా పెట్టుకున్న తొలి పార్టీ పీఆర్పీ అని, రాజకీయ పార్టీల చరిత్రలో 35.4 శాతం సీట్లు తాము బీసీలకు ఇచ్చామని చిరంజీవి గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ విజయం ఖాయమని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. తాను అందరివాడినని తమ రైలు గుర్తు కూడా అందరిదని, ఈసీ అనుమతితో రైలును అద్దెకు తీసుకున్నామని పీఆర్పీ అదినేత వెల్లడించారు. సీనియర్ల ఆరోపణలపై చిరు స్పందిస్తూ.. టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు అసత్యమని, అంతర్గత విభేదాలు అన్ని పార్టీల్లోనూ సహజమని కొట్టిపారేశారు. తమ పార్టీ విషవృక్షం కాదని, వెనుకబడిన వర్గాలకు చెందిన ఎవరకో మంచి అవకాశాలు ఇచ్చిన కల్పవృక్షమని అన్నారు. |