తమ పార్టీ గుర్తు రైలు ఇంజన్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు నిర్ణయించిన ప్రజారాజ్యం పార్టీ శనివారం ప్రజారైలు యాత్రను ప్రారంభించింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ప్రజారైలు యాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.
రైలుయాత్రలో పాల్గొనేందుకై పీఆర్పీ పార్టీకి చెందిన అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరూ పార్టీకి మద్దతుగా నినాదాలు చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. చిరంజీవి, రామ్‌చరణ్‌తేజ, అల్లూ అర్జున్‌ల రాకతో రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని తమ అభిమాన నటుల్ని చూచి కేరింతలు కొట్టారు.
ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ రైలుయాత్రతో తమ పార్టీ గుర్తైన రైలింజన్ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకు పోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ రైలుయాత్ర మొత్తం మూడురోజులపాటు సాగనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడల మీదుగా పయనించే ఈ రైలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వరకు కొనసాగనుంది. |