కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలన్నీ అవినీతిమయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. వోక్స్‌వ్యాగన్, సర్వశిక్ష అభియాన్, దేవాదాయ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, సత్యం, మేటాస్, వెలుగుబంటి సూర్యనారాయణ ఉదంతాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతానికి ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని, నీటిపారుదలలో రూ. 10వేల కోట్లు దిగమింగారని ఆరోపించారు. మద్యం ఆదాయం రూ. 1500 కోట్ల నుంచి రూ. 5వేల కోట్లకు పెరిగితే దాన్ని కాంగ్రెస్‌వారు తమ జల్సాలకు ఉపయోగిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రకటించిన సొమ్ము పంపిణీ, కలర్ టీవీల పథకాలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో ప్రజలు విలవిలలాడుతున్న వేళ వారి కొనుగోలు శక్తిని పెంచేందుకు సొమ్ము పంపిణీ పథకం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ హాయాంలో జరిగిన అవినీతిని ఆపితే ఈ పథకాన్ని చక్కగా అమలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదవారికి వినోదం, విజ్ఞానం అందించేందుకు ఉద్దేశించిన కలర్ టీవీల పంపిణీ పథకం కూడా మంచిదేనని అన్నారు. |