ప్రజారాజ్యం పార్టీ గుర్తు రైలింజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రారంభించిన ప్రజా రైలు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం ఉదయం ప్రజా రైలు యాత్రను ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిరంజీవి జెండా ఊపి ప్రజా రైలు యాత్రను ప్రారంభించగా, మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్ర సాగుతుంది. ఈ రైలులో ప్రయాణించే యువ నటులు రామ్‌చరణ్ తేజ్, అల్లు అర్జున్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
యాత్ర ప్రారంభానికే ముందు మంచి ఆదరణ లభిస్తోంది. రైలులో ప్రయాణిస్తున్న యువ హీరోలను చూసేందుకు పీఆర్పీ కార్యకర్తలు, వారి అభిమానులు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు తరలి వస్తున్నారు. కాగా, ఈ ప్రజా రైలు యాత్ర కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు స్టేషన్లలో ఆగుతుంది.
ఆదివారం శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుగు ప్రయాణం మొదలెట్టి చీపురుపల్లి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రికి చేరుకుంటుంది. సోమవారం విజయవాడ, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంటకు చేరుకుంటుంది. |