మరో ఐదేళ్ళు పాలించేలా తమకు అధికారాన్ని అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం, మేలు జరిగేలా ఇందిరమ్మ అభయహస్తం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణను చూసిన ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
గత ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో గూడు లేని వారు ఒక్కరు కూడా ఉండకూడదనే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. గత తొమ్మిదేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన పథకాలన్నింటినీ ఇపుడు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ఆయన హితవు పలికారు.
ఆల్‌ఫ్రీ బాబుగా పేరుగాంచిన చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలుకు అలవికానివని ఆయన జోస్యం చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుతం అయోమయ రాజ్యంగా మారిందని, రోజుకు ఒక్కో పెట్టె ఊడిపోతోందని, చివరకు రైలింజన్ మాత్రమే మిగిలేలా ఉందన్నారు. |