ప్రజారాజ్యం పార్టీకి డబ్బే లక్ష్యమని అందుకే డబ్బున్నవారికే ఆ పార్టీ టికెట్లు కేటాయించిందని ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ ఓ కంపెనీ అని అది ఆ కంపెనీ ఓనర్లకు మాత్రమే కల్పవృక్షమని ఆయన విమర్శించారు.
బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం పరకాల మీడియాతో మాట్లాడారు. పార్టీనుంచి బయటకు వచ్చిన తనపై ప్రజారాజ్యం పార్టీ అగ్రనేత అల్లు అరవింద్ అనవసర అరోపణలు చేశారని అందుకే తాను కొన్ని విషయాల్లో వివరణ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చానని పేర్కొన్న పరకాల మరోసారి పీఆర్పీపై విమర్శలు గుప్పించారు.
సర్వేల ప్రకారమే అభ్యర్ధులకు టికెట్లిచ్చామని పీఅర్పీ చెబుతున్న మాటలు అవాస్తవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీసీలకు 104 టికెట్లు ఇచ్చామని పీఆర్పీ చెబుతున్న వ్యాఖ్యల్లోనూ నిజం లేదని చెప్పిన పరకాల ఆ 104మందిలో 38మంది అసలు బీసీలే కాదని స్పష్టం చేశారు. |