తిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తరపున ప్రచారం నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మూడు రోజులపాటు చిరంజీవికి మద్దతుగా వీరు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రచారం కోసం రంగంలో దిగిన చిరంజీవి సోదరి మాధవి, నాగబాబు భార్య పద్మజ, ఇతర కుటుంబ సభ్యులు తిరుపతిలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం వీరు స్థానిక కొర్లగుంట ప్రాంతంలో తమ ప్రచారం ప్రారంభించారు. ప్రజారాజ్యం మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ చిరంజీవికి ఓటు వేయాలని, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వారు ముందుకు సాగుతున్నారు.
అదేసమయంలో శనివారం సికింద్రాబాద్‌లో చిరంజీవి ప్రారంభించిన ప్రజా రైలుయాత్ర సోమవారం తిరుపతికి చేరనుంది. ఈ రైలులో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ, కుమార్తె, అల్లుడులతోపాటు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్‌లు ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు చిరంజీవి సైతం ఈ నెల 21న తిరుపతిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. |