రాష్ట్రంలోని పేదల అవసరాలను తీర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదల అవసరాలు తీర్చేందుకై రేషన్ కార్డులు ఇచ్చామని, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందించామని, ఇళ్లు నిర్మించామని ఆయన తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో మంగళవారం పర్యటించిన వైఎస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హాయాంలో ప్రతి వర్గంవారికి అవసరమైన అన్నింటిని చేకూర్చామని అన్నారు. పట్టణ మహిళలకోసం పావలా వడ్డీకే రుణాలు ఇచ్చామని దీనివల్ల ఎందరో మహిళలు వ్యాపారాలు చేస్తున్నారని, తద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అలాగే మైనార్టీల కోసం ఉపకార వేతనాలు ఇచ్చామని, టీడీపీ హయాంలో ఈ ఉపకార వేతనాలు రూ. 4 కోట్లు మాత్రమే ఉంటే తమ హాయాంలో అవి రూ. 237 కోట్లకు చేరిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని, ఈరోజు ప్రతి పేదవాడు కార్పోరేట్ వైద్యం చేయించుకోగల్గుతున్నాడంటే అది తమ చలవేనని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ, పీఆర్పీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఎలాంటి అజెండా లేకుండానే వామపక్షాలు టీడీపీతో జట్టు కట్టాయని ఆయన దుయ్యబట్టారు. అలాగే ఇటీవల తెరమీదకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సినిమా పార్టీ అని ఆయన విమర్శించారు. |