ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేంద్రంలో ఎవరితోనైనా జట్టు కట్టేందుకు, ఏదైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. దీనిని సాధించుకునేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతామని స్పష్టం చేశారు.
శనివారం కేసీఆర్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటాం. కుష్టురోగిననైనా కౌగిలించుకుంటామన్నారు. ఈ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని గుర్తు చేశారు. వచ్చే నెల ఫలితాల అనంతరం రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌తోపాటు, అన్ని పార్టీలు అనూకూలత ప్రకటించాయి. మొదటి శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణపై తీర్మానం చేయాలి. ఈ తీర్మానాన్ని అనుకూలత ప్రకటించిన అన్నిపార్టీలు బలపరచాలని కోరారు.
ఇదిలా ఉంటే కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణకు మంచి మద్దతు ఉందన్నారు. తాజాగా జయలలిత ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని వారి మేనిఫెస్టోలో చెప్పడాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తాను ఈ నెల 26న ఢిల్లీకి వెళుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. |