వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి గురువారంతో ఐదేళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాల్ బహుదూర్ స్టేడియంలో 2004 మే 14వ తేదీన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రికార్డు సృష్టించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్-తెరాసలు కలిసి పోటీ చేసి 226 సీట్లను సొంతం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యత వచ్చినప్పటికీ, పొత్తు ధర్మానికి కట్టుబడి వైఎస్సార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఐదేళ్ళ కాలంలో ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, కిలోబియ్యం రూ.2కే పంపిణీ, పావలా వడ్డీకే రుణాలు, వృద్ధాప్య పింఛన్లు ఇలా.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్సార్ మంచి పేరు తెచ్చుకున్నారు.
అదే సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం, ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో అనుచరులకు, బడా పారిశ్రామికవేత్తలకు వేలాది భూములను ధారాదత్తం చేయడం వంటి చర్యల వల్ల వైఎస్సార్‌పై కొంత వ్యతిరేక వచ్చింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా చేరడం వల్ల అవినీతి ఆరోపణల ప్రభావం పెద్దగా కనిపించలేదు. |