రాష్ట్రంలో ఆకాశాన్ని అంటుతున్న అధిక ధరలను తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెట్టే కారణమని పేర్కొంటుండగా, వీటిపై పూర్తి స్వేచ్ఛతో దాడులు నిర్వహించాలని విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ మార్కెట్ ద్వారానే ధరలు పెరిగాయని, దీనికి నిల్వల కొరత కారణం కాదని అన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాలు, పప్పులు, కూరగాయల ఉత్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు.
అందువల్ల ఆయా ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులను ఆదేశించారు. సరుకులను బ్లాక్ చేయడాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేయాల్సిందిగా సూచించిన ఆయన అలా పట్టుబడిన సరుకులను వెంటనే మార్కెట్టుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. |