గత నెల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను పటిష్టవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ. సుబ్బారావు ప్రస్తుతం ఎన్నికలలో గెలుపొందే నాయకులకు మరిన్ని సూచనలు చేశారు. ఇందులో భాగంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలనుకునేవారు ప్రత్యేక అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలనుకునేవారు ఆయా జిల్లాల ఎస్పీ, కలెక్టర్లనుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన కోరారు. ర్యాలీల నిర్వహణపై ఆయా జిల్లాల ఎస్పీ, కలెక్టర్లకే నిర్ణయాధికారాన్ని అప్పజెప్పామని సుబ్బారావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా అనుమతిని మంజూరు చేసే అధికారులు అప్రమత్తంగా ఉండి ఆయా ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని ఆయన అధికారులను కోరినట్లు సమాచారం. |