సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఫలితాలు వెలువడటానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే గడువు ఉండటంతో అన్ని పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నడూ లేనంత ఉత్కంఠ ఈ సారి జరిగిన ఎన్నికల ఫలితాలకు కనపడుతోంది.
ఏ పార్టీ ఎటువైపు మళ్లుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది. సమయానుకూలంగా గ్రూపులు మారుతుండటం సహజం. ఈ నేపథ్యంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం తీసుకున్న నిర్ణయమే మరి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పీఆర్పీ, తేరాస, టీడీపీ తదితర పార్టీలు తమ తమ అభ్యర్థులను భద్రపరచుకునే దిశలోనున్నాయి.
ఇందులో ప్రథమంగా టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గులాబీ అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో క్యాంప్ ఏర్పాటైంది. ఇప్పటికే అభ్యర్థులతో కిటకిటలాడుతోంది. కాగా ఢిల్లీ పర్యటనలోనున్న తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావుకూడా శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు పీఆర్పీ రిసార్ట్‌ల వేటలో పడింది. రిసార్ట్‌లలోనే ఆ పార్టీతరపున పోటీ చేసిన అభ్యర్థులందరికి సకల సౌకర్యాలు అందజేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ నేతృత్వంలోని బృందం ఒకటి సిద్ధమైంది.
కాగా తమ పార్టీల అభ్యర్థులందరూ తమ తమ ఫలితాలతో వెంటనే హైద్రాబాద్ చేరుకునేలా ఏర్పాట్లనుకూడా పీఆర్పీ చేసినట్లు సమాచారం. |