గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని, దీనికి ప్రతిగా రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళతామని, అభివృద్ధిని ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... పేదల సంక్షేమంపై మరింత శ్రద్ధ చూపి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళతామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, తన అభిమానులు అభినందనల పేరుతో డబ్బును వృధా చేయవద్దని ఆయన కోరారు. తాను బుధవారంనాడు చేపట్టబోయే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి తరలి వచ్చేవారు పూల దండలు, శాలువాలు, కండువాలు తదితరాల వంటివి తీసుకురావద్దని ఆయన వారికి సూచించారు. దీనికైయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి విరాళాలుగా ఇవ్వాలని, విరాళాలుగా వచ్చే ఆ డబ్బుతో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. |