రాష్ట్ర డీజీపీ యాదవ్‌పై మరోమారు వేటు పడనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆయన స్థానంలో అవినీతి నిరోధక శాఖ అధిపతి ఆర్.ఆర్ గిరీష్ కుమార్‌ను నియమించనున్నట్లు తెలిసింది.
గతంలో రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్నూలు మీడియా సమావేశంలో డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగాను, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని గతంలో తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాయి. దీనిపై విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ యాదవ్‌ను బదిలీ చేసి ఏకే మహంతిని డీజీపీగా నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలే చర్యలు చేపట్టింది.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత యాదవ్ మళ్ళీ తన స్థానంలోకి వచ్చారు. వచ్చీ రాగానే పోలీసు శాఖలోనే మిత్రులకు బదులు శత్రువులను కొనితెచ్చుకోవడంతోపాటు అనవసర వివాదాల్లో తల దూరుస్తూ ప్రభుత్వానికి లేని తలనొప్పులు తెస్తున్నందుకే యాదవ్‌పై వేటు వేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.
రెండు మూడు రోజుల్లో జరిగే ఐపీఎస్ అధికారుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సమయంలోనే యాదవ్‌ను ఇంటికి పంపేందుకు ముహుర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. వివాదాస్పద పోలీసు అధికారిగా పేరొందిన డీజీపీ ఎస్‌ఎస్‌పి యాదవ్ మరోదఫా తన పదవిని పోగొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు మార్చినెల 18వ తేదీన ఆయనని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ఏ.కె. మహంతిని నియమించిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికలు ముగిశాక ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కరుణతో మళ్లీ డీజీపీగా యాదవ్ నియమితులయ్యారు. యాదవ్‌ను తిరిగి డీజీపీగా నియమించడం పోలీసు శాఖలో చాలామందికి అసలు ఇష్టంలేదు.
రాష్ట్ర హోంశాఖ సైతం యాదవ్ నియామకం పట్ల అయిష్టంగానే ఉంది. అయితే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఎవరూ కాదనలేకపోయారు. డీజీపీగా రెండవసారి బాధ్యతలు చేపట్టాక వారం పది రోజులపాటు బాగానే వున్న యాదవ్ అటుపిమ్మట అందరితో గతంలోలానే తగాదాలకు శ్రీకారం చుట్టడం పోలీసుశాఖలో కలకలంరేపింది.
తొలుత ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రంలో నెల రోజులపాటు డీజీపీగా పనిచేసిన మహంతితోపాటు 20మంది సీనియర్ ఐపీఎస్‌లకు యాదవ్ మెమోలు ఇవ్వడం సంచలనం సృష్టించింది. దీనిపై చాలామంది ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ విషయమై వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు.
ఈ వివాదం సద్దుమణగక ముందే డీజీపీ మరో అడుగు ముందుకేసి ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ.సుబ్బారావుతో ప్రత్యక్ష పోరుకు దిగారు. ఎన్నికల సమయంలో తనను ఎందుకు పదవి నుంచి తొలగించారో..? వివరించాలని మూడు లేఖలు రాసి మరో వివాదానికి తెరలేపారు.
ఈ లేఖల్లో రెండింటికి సుబ్బారావు సమాధానం ఇచ్చినా యాదవ్ సంతృప్తి చెందలేదు. దీనిపై కోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. చివరకు ఈ వివాదం చీఫ్ సెక్రటరీ పేషీకి కూడా చేరింది. ఎన్నికల సంఘానికి లేఖలు రాసిన డీజీపీపై చీఫ్ సెక్రటరీ రమాకాంత్‌రెడ్డి ఆగ్రహం చెందడంతోపాటు ఆయన్ను మందలించారుకూడా.
ఇదిలావుండగా డీజీపీ వ్యవహారం ప్రతిపక్ష పార్టీల్లోనూ అసహనం రేపింది. యాదవ్‌ను వెంటనే తొలగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
కాగా డీజీపీ యాదవ్ లేని పోని వివాదాల్లో తలదూరుస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులుచేస్తుండటంతో ఆయన్ను తప్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. |