రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకువస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేక బిల్లును తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు.
ఈ బిల్లుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ బిల్లును అమలుకు తెస్తామని ఆమె చెప్పారు. డీజీపీ ఎస్సెస్పీ యాదవ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు మధ్య విభేదాలేవీ లేవని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
రాష్ట్రంలో త్వరలోనే 37 వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హోం మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ నియామకాల్లో మహిళలకు 20 శాతం మేరకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పుకొచ్చారు. |