సమైక్యాంధ్రపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయం తన వ్యక్తిగతమని, మాతృసంస్థ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రకు అనుకూలమన్న స్పష్టతకు రావాలని తాను చెప్పిన విషయాన్ని అధ్యక్షుడు చంద్రబాబు సావధానంగా విన్నారన్నారు. పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకున్న కారణంగానే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమిని చవిచూసిందని ఆయన మరోమారు చెప్పారు. అన్ని విషయాలపై తాను చంద్రబాబుతో చర్చించానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ వాదమే పార్టీ పుట్టి ముంచిందన్న విషయాన్ని స్పష్టంగా విన్నవించినట్టు చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల వరకు కూడా పార్టీ తెలంగాణ వాదంతోనే కొనసాగితే మరోసారి పరాభవం తప్పదని కూడా తాను స్పష్టంగా చెప్పినట్టు తలసాని యాదవ్ వెల్లడించారు. |