ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల గుర్తును మార్చుకోనుంది. ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న గుర్తుల్లో ఐదింటిని ప్రధానంగా పరిశీలిస్తోంది. వీటిలో సూర్యుడు, గొడుగు, రెండాకుల గుర్తుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సేకరించిన అభిప్రాయాల మేరకు ఎక్కువ మంది "సూర్యుడు" గుర్తుపైనే మొగ్గు చూపుతున్నారు. పార్టీ పతాకంలో సూర్యుడు చిహ్నం ఉండటం, ఇప్పటికే అది ప్రజల్లో బాగా చొచ్చుకుని పోవడంతో దానిపైనే అధికంగా మొగ్గు చూపుతున్నారు. అయితే, పై మూడు గుర్తులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉంచి పరీక్షిస్తారు. ఆ తర్వాత వీటిలో స్పష్టంగా, ఓటర్లను అయోమయానికి గురి చేయని గుర్తును ఎంపిక చేస్తారు. ఈ గుర్తుపైనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఇందుకోసం మొత్తం స్థానాలను ఐదు డివిజన్లుగా విభజించామన్నారు. ఈ డివిజన్లలో ఎన్నికల పనులను సమీక్షించేందుకు ఐదుగురు సీనియర్ నేతలను నియమించినట్టు చెప్పారు. వీరిలో కోటగిరి విద్యాసాగర్ రావు, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, సి.రామచంద్రయ్యలు ఉన్నట్టు చిరంజీవి వివరించారు. |