ఆధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. దసరా పండుగ తర్వాత ఈ తనిఖీలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తానని వైఎస్ అధికారులను హెచ్చరించారు.
అధికార యంత్రాంగం బాధ్యతలు మరువరాదని హితవు పలికారు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన కలెక్టర్ల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కొందరు మంత్రులపై వైఎస్ కొంత అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా అధికారులు ప్రతి విషయానికి జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ పదిసార్లు తిరిగిన తర్వాత పని జరిగితే పౌరునికి సంతృప్తి ఉండదని, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ అధికారుల దృష్టికి వస్తే వెంటనే దాన్ని పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాజధానిలో రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సు చివరి రోజున జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో కూడా ఆయన ఉమ్మడి సమావేశం నిర్వహించారు. |