తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నాయకులపై పార్టీ వేసిన బహిష్కరణ వేటును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం పార్టీలో కొనసాగిన కీలక పరిణామాల అనంతరం కేసీఆర్ బహిష్కృత నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అసమ్మతులే కాకుడా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎవరు వస్తామన్నా సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణ ప్రజల్లో అయోమయం సృష్టించి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను సీజ్ చేయాలన్న సమైక్యవాదుల కుట్రను తాము భగ్నం చేశామన్నారు.
ఎందరు ఎన్ని కుట్రలు పన్నినా పదునైన వ్యూహాలతో వాటిని తిప్పికొడతామన్నారు. అంతిమ విజయం తమదే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏర్పడిన సంక్షోభం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హస్తం ఉందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌ను సీజ్ చేయాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బందోబస్తు పెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. |