అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో అధికార కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. దీంతో మరి కొద్ది రోజుల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా విజయభేరీ మోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం అవసరమైన కసరత్తులను ఇప్పటికే ఆ పార్టీ ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ఎన్నికలపై చర్చించడానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ సోమవారం భాగ్యనగరానికి చేరుకోనున్నారు. ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డితో ఆయన సమావేశమై ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నాయి. మొత్తం 150 వార్డులు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించి, మేయర్ పదవిని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. |