ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు పద్మభూషణ్ చిరంజీవి తన మనస్సు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ వెండితెరపై మెగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన కుమారుడు నటించిన "మగధీర" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో చిరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. అటు కాదనకుండా, ఇటు వస్తానని డైరక్టుగా చెప్పకుండా ఆయన తన మనస్సులోని మాటను వెల్లడించారు. రాష్ట్ర ప్రజానీకం రమ్మన్నారంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తన అభిమానులను ఓట్లుగా మలుచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజకీయాల్లో ఆశించినంతగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. పార్టీ ఊహించినంత బలం సాధించలేక పోవడంతో ఆయన మనస్సు మళ్లీ టాలీవుడ్‌పై పడింది. దీంతో ప్రజాసేవకు పరిమితం అవుతానన్న చిరంజీవి.. మళ్లీ వెండి తెరవైపు చూస్తున్నారు. మొన్న ప్రజల పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన చిరు, నేడు.. అభిమానులు రమ్మంటున్నారంటూ సడన్‌గా సినిమాలకు ఓకే చెప్పినా ఆశ్చర్య పోనవసరం లేదని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు. తనయుడు రామ్‌చరణ్ నటించిన "మగధీర" ఆడియో తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అంతా ముక్తకంఠంతో కోరిన కోర్కె ఒక్కటే. చిరంజీవి తిరిగి చిత్రాలను చేయాలని వేదికపై నుంచి మాట్లాడిన ప్రతివారూ కోరారు. దీనికి మెగాస్టార్ కరుణించినట్టే కనిపించారు. అవునూ, కాదూలకు మధ్యనే ఊగిసలాడిన చిరంజీవి సమాధానం.. ఫైనల్‌గా ఓకే అన్నట్టు అనిపించింది. ఇప్పటికే సీనియర్ హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ.. మెగా ఎంట్రీతో కొత్త ఉత్సాహం పొందే అవకాశం ఉంది. రెండు, మూడు తరాల హీరోల సినిమాలతో సంతృప్తి చెందుతున్న సగటు ప్రేక్షకులు కూడా చిరు ఎంట్రీతో కాస్త రిలీఫ్ కావడం ఖాయమని అంటున్నారు. ఆబాల గోపాలాన్ని ఆలరించే ఒకే ఒక్క కథానాయకుడు మళ్లీ అభిమానులకు కొత్త ఊపిరినిస్తారని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ భావిస్తోంది. అలనాడు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూనే చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. ఆయన నటించగా లేనిదీ.. చిరంజీవి చేస్తే తప్పేంటన్న వాదనలు వినొస్తున్నాయి. మొత్తం మీద.. ఈ శేష జీవితం ప్రజాసేవకే అంకితమన్న చిరంజీవి.. పెంచి, పోషించి, ఇంతవాడిని చేసిన సినీకళామతల్లిని మరువలేక పోతున్నారన్న విషయం ఈ సంఘటనతో తేటతెల్లమవుతోంది. |