బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథంపై పోలీసులు కేసు నమోదు చేసింది. బ్యాంకు మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారని ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మందా జగన్నాథంపై పోలీసులు ఐపిసి 353, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, బ్యాంకు మేనేజర్‌పై మందా జగన్నాథం అనుచరులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసును పోలీస్ స్టేషన్‌లో ఎదురు పెట్టారు. విధి నిర్వహణలో ఉన్న బ్యాంకు మేనేజర్‌పై చేయిచేసుకున్న ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి.
ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన రుణాలను విడుదల చేయకుండా గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు ఎందుకు విడుదల చేయడం లేదని తాను రవీందర్ రెడ్డిని ప్రశ్నించగా, ఆయన మద్యం సేవించిన మత్తులో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఎంపీ ఆరోపిస్తున్నారు.
అయితే, తాను విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, బ్యాంకుకు సంబంధించిన ఇతర పనుల వత్తిడి కారణంగా రుణాలు విడుదలలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని మేనేజరు వివరణ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరలోనే విడుదల చేస్తానని చెప్పినా ఎంపీ పట్టించుకోకుండా తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. |