మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుతో నెల్లూరు జిల్లాలో ఏకంగా రెండు రేషన్ కార్డులు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఏరివేతలో బోగస్ కార్డుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చిత్రంగా టీం ఇండియా బ్యాట్స్‌మన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఏకంగా రెండు రేషన్ కార్డులు జారీ కావడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.పేద ప్రజలకు రెండు పూటలా కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కిలో రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం అవసరమైన తెల్లరేషన్ కార్డులను కూడా జారీ చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఈ తెల్లకార్డుల్లో పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులున్నట్లు తేలింది. దీంతో తెల్లకార్డులను పంపిణీ చేసిన తర్వాత బోగస్ కార్డులను ఏరివేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. |