మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు చేతకాని దద్దమ్మల్లా వ్యవహిస్తున్నారని, అందువల్లే రైల్వే బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మన రాష్ట్రంపై ఎలాంటి ప్రేమలేదనే విషయం మరోమారు తేటతెల్లమైందన్నారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీ సమర్పించిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామంటూ మమత చేసిన బడ్జెట్ ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదన్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వరుసగా దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా మన రాష్ట్ర ఎంపీలు నిద్రావస్థలో జోగుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి అసమర్థ ఎంపీలు ఉన్నంత కాలం రాష్ట్రానికి అన్యాయమే కానీ న్యాయం జరగబోదని జోస్యం చెప్పారు.
మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం అభివృద్ధి కోసం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారా? అని చిరంజీవి ప్రశ్నించారు. రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయమే వారి నిష్క్రియాపరత్వానికి తార్కాణమని విమర్శించారు. మన ఎంపీలు కేవలం 'బోయీలు'గా మాత్రమే పనికివస్తున్నారా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. |