రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని కొవ్వూరు శాసనసభ్యుడు రామారావు ఆరోపించారు. ఏదో పథకం ప్రకారమే ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన చెప్పారు. టీవీ సీరియల్‌లో కొత్త పాత్రలు పుట్టుకొచ్చినట్లు తనపై అక్రమ కేసులు పెట్టేందుకు కొత్తవారిని తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.
తనను హత్య చేస్తామని అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయితే వాటికి జంక కుండా న్యాయం కోసం పోరాడుతానని రామారావు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు కేసు వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆయనపై కేరళకు చెందిన కొందరు విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు.
తన కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేశాడన్న సంఘటన బయట పడిన రోజుకు మూడు రోజుల ముందు తనపై రామారావు అత్యాచారం చేశాడని ఒక విద్యార్థిని హోం మంత్రికి ఫిర్యాదు చేసింది.
అలాగే రామారావు తనపై రెండు సార్లు అత్యాచారయత్నం చేశాడంటూ అదే కళాశాలలో చదువుతున్న కేరళకు చెందిన మరో విద్యార్థిని కూడా హోం మంత్రికి ఫిర్యాదు చేసింది.
ఈ కేసు సీఐడీ పరిధిలో ఉన్నందున విద్యార్థినుల విచారణను వారికే అప్పజెప్పినట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ కేసులో విద్యార్థినులకు సరైన న్యాయం చేస్తామని సబిత హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. |