తెలుగుదేశం పార్టీలో తుఫాను సృష్టిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చర్య తీసుకునేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. ఇందుకోసం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ తలసాని నడుచుకున్న తీరు, వ్యవహార శైలిపై ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత తలసానిపై చర్య తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా, గ్రేటర్ హైదరాబాద్ నేతలతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన స్వగృహంలో బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తలసాని గైర్హాజరయ్యారు.
ఈ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల వ్యూహం, తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారిస్తున్న తీరుపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా తలసానికి షోకాజ్ నోటీసు జారీ చేసే అంశంపై చర్చించారు. అంతేకాకుండా, పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని ఉపేక్షించరాదని గ్రేటర్ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. |