మరికొన్ని రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగనున్న తరుణంలో తెలంగాణా రాష్ట్ర సమితికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ఏర్పడిన అసంతృప్తి సెగలు చల్లారక ముందే తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన తెరాస యువజ విభాగం అధ్యక్షుడు కెవి.వివేకానంద్ పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణా భవన్‌కు ఆయన ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం అనంతరం తెరాసలో అసంతృప్తి సెగలు ఒక్కసారి ప్రజ్వరిల్లిన విషయం తెల్సిందే.
ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తెలంగాణా రాష్ట్ర విమోచన సమితి (టీవీఎస్) పేరుతో కొత్త కుంపటి పెట్టారు. దీంతో ఖంగుతిన్న తెరాస అధినేత అసంతృప్తులతో బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఇవి కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నేత పార్టీకి గుడ్‌బై చెప్పడం తెరాసకు గట్టి ఎదురుదెబ్బలాంటిదే. |