కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంపై కరుణ చూశారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. దీంతో రాష్ట్రానికి కొత్తగా మరో ఐదు రైళ్ళను కేటాయించారు. హైదరాబాద్-న్యూఢిల్లీల మధ్య నాన్ స్టాఫ్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపనున్నట్టు మమతా బెనర్జీ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. అలాగే, కొత్తగా ప్రకటించిన మిగిలిన నాలుగు రైళ్ళ వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.
ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని మీటర్ గేజ్ రైలు మార్గాలను మరో ఏడాదిలో బ్రాడ్‌గేజ్‌గా మార్చనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈనెల రెండో తేదీన ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చలో జరిగిన అన్యాయంపై ముక్తకంఠంతో నిలదీశిన విషయం తెల్సిందే. |