రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. యాసిడ్ దాడులకు పాల్పడే వారికి నాన్ బెయిలబుల్ వారెంట్, పది సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నట్టు చెప్పారు.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతామన్నారు. ఇందుకోసం తక్షణం సమాచారాన్ని చేరవేసేందుకు టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడుతున్న ఛాముండేశ్వరినాథ్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఈ నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె సభకు తెలిపారు. చట్టం ఎవరికీ చుట్టం కాదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తించుకోవాలని, ప్రతి విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు.