ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జాడ ఇంకా తెలియరాలేదు. చిత్తూరులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన ఆయన.. బుధవారం ఉదయం 9.35 నిమిషాలకు వైఎస్ ప్రయాణించే హెలికాఫ్టర్ కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు వైఎస్ జాడ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ అచూకీ తెలియక పోవడంతో ఆందోళనకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అదృశ్యమైన ముఖ్యమంత్రి వైఎస్ జాడ కోసం జరుగుతున్న గాలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా వైఎస్ కుటుంబ సభ్యులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు ఆమె రాజధానికి వస్తున్నట్టు సమాచారం.
అయితే, దీనిపై రాష్ట్ర మంత్రి కె.రోశయ్య మాత్రం అధికారిక సమాచారం ఇవ్వలేదు. సోనియా రాకపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఇదిలావుండగా, సోనియా రాక ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అంచనా వేసేందుకు, భవిష్యత్ కార్యాచరణపై సలహాలు ఇవ్వడం, అవసరమైతే అత్యవసర నిర్ణయాలు తీసుకోవడానికే ఆమె ఈ పర్యటనలో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఇప్పటికే కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, పృధ్వీరాజ్ చౌహన్‌లు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా, పార్టీ అధినేత్రి సోనియా కదలి రావడం వెనుక బయటకు చెప్పలేని రహస్యం దాగి ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు.