రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తదితర రాజకీయ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని వైఎస్సార్‌కు ఘనంగా అంతిమ నివాళులు అర్పించారు.
అనంతరం అక్కడ ఉన్న పుస్తకంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నేతలు సంతాప సందేశాలు రాశారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తమ ప్రియతమ నేత ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూడా వైఎస్‌కు నివాళులు అర్పించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ భౌతికకాయాన్ని మరి కాసేపట్లో ఎల్పీ స్టేడియానికి తరలించనున్నారు. ఇక్కడ సాధారణ పౌరుల సందర్శనార్థం వైఎస్ భౌతికకాయాన్ని ఉంచుతారు. లక్షలాదిగా తరలివచ్చే అభిమానులు, సాధారణ పౌరుల కోసం యంత్రాంగం రాష్ట్ర రాజధానికి, ఆయన అంత్యక్రియలు జరిగే ఇడుపులపాయకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతోంది. ఎల్బీ స్టేడియం వద్ద అధికారిక యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ రోజు సాయంత్రం ఇడుపులపాయలో వైఎస్సార్ అంత్యక్రియలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు రాజధాని నుంచి వైఎస్సార్ భౌతికకాయాన్ని ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో ఇడుపులపాయ ఎస్టేట్‌కు ఆయన మృతదేహాన్ని తీసుకెళతారు. వైఎస్ ఎంతో ఇష్టపడే ఇడుపులపాయ ఎస్టేట్‌లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.