దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయనకు అత్యంత ప్రీతిప్రాయమైన ఇడుపులపాయకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ఎల్బీ స్టేడియం నుంచి వైఎస్ శవపేటికను బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. వైఎస్ మృతదేహాన్ని ఇడుపులపాయకు తీసుకెళ్ళేందుకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక సైనిక హెలికాప్టర్ సిద్ధంగా ఉంచారు.
ఈ ప్రత్యేక సైనిక హెలికాఫ్టర్‌ను అనుసరించి వెళ్ళేందుకు మరో ఎనిమిది హెలికాఫ్టర్లు, ఇంకో నాలుగు ప్రత్యేక విమానాలు సిద్ధం చేశారు. వైఎస్ పార్థివ శరీరం తరలింపు కోసం బేగంపేటలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈ ప్రత్యేక హెలికాఫ్టర్లు, విమానాల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో పాటు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, కేంద్ర మంత్రులు బయలుదేరి వెళతారు.