ఈనెలలో జరుగనున్న టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఈ ఉప ఎన్నికలు ప్రరాపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలుకావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి మారిపోయాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో టెక్కలి ఉప ఎన్నిక ప్రచారానికి చిరు వెళ్లడం భావ్యం కాదని ప్రరాపా నేతలు భావించారు. దీంతో ఈనెల 17వ తేదీన జరుగనున్న ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను స్థానిక నేతలకే చిరంజీవి అప్పగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ప్రరాపా అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు.
టెక్కలి ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పాల్గొనేందుకు ఆ పార్టీ ఎప్పుడో షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వైఎస్ ప్రమాదంలో మరణించడం వైఎస్ తనయుడు జగన్మోహనరెడ్డి సీఎం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉండటం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విపరీతమైన సానుభూతి వ్యక్తం అవుతూ ఉండటం ఈ పరిణామాలన్ని గమనించిన చిరంజీవి, ప్రరాపా నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.