ప్రేమ పేరుతో తనను వేధించడమే కాకుండా తన తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన నిందితుడు మట్టా రాజేష్‌ను చంపి వేయాలని బాధితురాలు నార్ల అనూష వేడుకుంది. ప్రేమోన్మాదం పేరుతో రాజేష్ అనే వ్యక్తి అనూషపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీనిపై బాధితురాలు అనూష మాట్లాడుతూ.. ఆ మానవ మృగాన్ని చంపేయాలని లేదంటే తనకు పట్టిస్తే నరికేస్తానని ఆగ్రహంతో పేర్కొంది.
రాజమండ్రి లలితానగర్‌లో ఉంటున్న అనూష ఇంటిపై గురువారం రాత్రి దాడి చేసిన రాజేష్ ఆమె తల్లి సత్యవతి, తండ్రి శ్రీనివాస్‌ను నరికి చంపేశాడు. అనూష గొంతు కూడా కోశాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్న అనూషను శుక్రవారం ఉదయం మేజిస్ట్రేట్ కలిసి వాంగ్మూలం నమోదు చేశారు.
వాంగ్మూలం ఇస్తూనే తన కుటుంబాన్ని అన్యాయం చేసిన రాజేష్‌ను చంపేయాలంటూ అనూష మేజిస్ట్రేట్‌ను వేడుకొంది. రాజేష్‌ను పోలీసులు లేదా ప్రభుత్వం శిక్షిస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. అందుకే వాడిని తనకు అప్పగించాలని లేదా విద్యార్థులకు అప్పగిస్తే వాడి సంగతి వారే చూస్తారని పేర్కొంది.
ఇదిలావుండగా, ప్రేమోన్మాది దాడి ఘటనకు నిరసనగా శుక్రవారం రాజమండ్రిలో అన్ని వర్గాల వారు బంద్ పాటిస్తున్నారు. దాడి అనంతరం స్థానికులు రాజేష్‌ను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
శుక్రవారం రాజేష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరుచనున్నారు. ఇదిలావుండగా, రాజేష్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోని పోలీసులపై కూడా శాఖాపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.