ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన నార్ల అనూష, ఆమె చెల్లెళ్ళను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హోం శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాజమండ్రి సంఘటనపై శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావడం దురదృష్టకరంగా ఉందన్నారు.
అనూషకు, ఆమె చెల్లెళ్ళ విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. యాసిడ్ దాడులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్లే ఉన్మాదుల దాడులపైన కూడా మరో ప్రత్యేక చట్టాన్ని తెచ్చే దిశగా యోచన చేస్తున్నట్టు హోం మంత్రి తెలిపారు.
ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం కంటే స్థానిక ప్రజల నుంచి స్పందన రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, రాజమండ్రి సంఘటనకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని హోం మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న రాజేష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్‌లో ఇంలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.