ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 'ఎవరికి వారే యమునా తీరు'గా మంత్రుల వైఖరి: చిరు (Ministers | CM | Chiru | Rosaiah | Tirupati | Drinkinkg Water)
ఎవరికి వారే యమునా తీరుగా రాష్ట్ర మంత్రుల వైఖరి ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. వైఎస్ దుర్మరణం అనంతరం ఒక్క మంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు సహకరించడం లేదని విమర్శించారు.
తన సొంత నియోజకవర్గమైన తిరుపతిలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా కండలేరు జలాశయం నుంచి తిరుపతి పట్టణానికి తాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఆయన ఆ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రోశయ్య సమర్థుడే అయినప్పటికీ.. ఏ ఒక్క మంత్రి కూడా ఆయనకు సహకరించడం లేదన్నారు. అలాగే, ముఖ్యమంత్రి ఆపద్ధర్మమా, తాత్కాలికమా, శాశ్వతమా అనేది కాంగ్రెస్ అధిష్టానం వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. దీనివల్ల అటు మంత్రులతో పాటు.. ముఖ్యమంత్రిలో అయోమయం నెలకొని ఉందన్నారు.
ఇదిలావుండగా, తిరుపతి ఒక రోజు పర్యటనను ముగించుకున్న చిరంజీవి హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రరాపా స్థానిక కమిటీలకు తుదిరూపం ఇచ్చేందుకు ప్రరాపా రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన నియోజకవర్గ పర్యటనను ఒక్కరోజుకు కుదించుకున్నారు.