కాంగ్రెస్ శ్రేణులూ... 'గ్రేటర్'కు సిద్ధం కండి: ఆనం పిలుపు
శుక్రవారం, 18 సెప్టెంబర్ 2009( 17:42 IST )
త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు.
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ అంశంపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ జీహెచ్ ఎంసీ అధికారులతో సమావేశమై చర్చించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి రామనారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు.
రాజధానిలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు 30 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జూలై నెలవరకు నగరంలో ఎలాంటి మంచినీటి ఎద్దడి ఉండబోదన్నారు.