జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కోర్ కమిటీ మౌనరాగం: ఆశలు వదులుకున్న జగన్! (Core committee | Sonia | Jagan | PM | CM Candidate)
 
File
FILE
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుని అంశంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ మళ్లీ పాత పాటే పాడింది. 'కర్ర విరగరాదు.. పాము చావరాదు' అనే చందంగా కోర్ కమిటీ భేటీ ముగిసింది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మరికొన్నాళ్లు నాన్చుడి ధోరణి అవలంభించాలని ఇందులో నిర్ణయించింది.

పనిలో పనిగా.. వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగించరాదనే నిర్ణయానికి వచ్చినట్టు వినికిడి. ఇది తెలుసుకున్న జగన్.. ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు వదలుకున్నారు. తిరిగి తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ముందుగా.. తన తండ్రి తుది శ్వాస విడిచిన నల్లమల అడవుల్లోనే పావురాల గుట్టకు వెళ్లి అంజలి ఘటించనునున్నారు. ఇందుకోసం ఆయన అనుచరులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ నుంచి నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. తన తండ్రి శాశ్వతంగా నిద్రపోతున్న ఈ ఎస్టేట్‌లోనే జగన్ విశ్రాంతి తీసుకుంటారు. తన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకోనున్నారు.

కాగా, ప్రధాని నేతృత్వంలో జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోంశాఖ మంత్రి పి.చిదంబరం, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని, సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్‌ పటేల్‌‌లు హాజరయ్యారు. ఈ కమిటీ వివిధ అంశాలపై గంటన్నరకుపైగా చర్చించగా, ఆంధ్ర వ్యవహారాలపై కేవలం మూడు నిమిషాలు మాత్రమే చర్చించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపైనే కమిటీ ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఉన్న మాట నిజమే అయినా, ఆయన్ని ఇప్పటికిప్పుడు తండ్రి స్థానంలో సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని తాము భావించడం లేదని కోర్‌కమిటీలోని ఒక సభ్యుడు అభిప్రాయపడ్డారు. దీంతో జగన్‌ తన ఆశలను పూర్తిగా వదులుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.