ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్ జగన్‌కు ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించింది. పలు అంశాల్లో ఆయనకు అనుకూలంగా సమాచారం వచ్చింది. అయితే, తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ వ్యాపార సామ్రాజ్యం "మూడు పువ్వులు ఆరు కాయలు"గా విస్తరించింది.
దీనికి తోడు.. ఆయనకు భజన చేసే అనుచరగణం సంఖ్య ఎక్కువైంది. దీంతో వన్ మ్యాన్ షో రాజకీయాలు నిర్వహించడం ఎక్కువైందని వైఎస్ వ్యతిరేక వర్గం అధిష్టానానికి నివేదిక అందజేసింది. ప్రధానంగా.. జగన్ తండ్రిలా ఛరిష్మా కలిగిన నేత అయినప్పటికీ.. తండ్రి చాటు బిడ్డగానే ఇవన్ని సంపాదించుకున్నాడని, వ్యక్తిగతంగా ఎలాంటి ఆదరణ లేదని పలువురు అభిప్రాయపడ్డారు.
పైపెచ్చు.. ఆయన కంపెనీల్లో చోటు చేసుకున్న అనేక రకాల అవినీతి ఆరోపణలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగానే ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉండటం వల్ల వీటిని చూసీ చూడనట్టు ఉండాల్సి వచ్చిందని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఎంపిక చేయరాదనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్టు సమాచారం.