స్వర్గీయ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యదైవం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సెప్టెంబర్ రెండున ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) కార్యదర్శి చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గత నెలలో ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదం సాధారణ ప్రమాదం కాదని, ఆయనను మట్టుబెట్టేందుకు చేసిన కుట్రలో భాగమేనని ప్రజలకు, తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పిసిసి కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు.
మా నాయకుడి హత్యకు ముందస్తు కుట్ర జరిగిందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి, ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉండవచ్చన్న విషయంపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న సిబిఐ, సిఐడి విచారణ సంస్థలు సైతం తోసిపుచ్చడం లేదని ఆయన అన్నారు.
ఎత్తయిన సిరిమాను కొండను దాటిన తర్వాత దానికన్నా తక్కువ ఎత్తున ఉన్న పావురాల గుట్టకు ఢీ కొట్టడం పరిశీలిస్తే ఇదేదో కేవలం వాతావరణం బాగోలేక తలెత్తిన ప్రమాదంగా తమకు అనిపించడం లేదని ఓ సీనియర్ పైలెట్ వ్యాఖ్యానించినట్లు ఆయన వివరించారు.
బలమైన కారణాలు ఉంటే తప్ప ఇలాంటి దుర్ఘటన జరిగేందుకు ఆస్కారం లేదని ఈ రంగంలోని నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారని, దీనినిబట్టి ఈ ప్రమాదం వెనుక ఏదో కుట్ర దాగివుండవచ్చనే అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయని ఆయన తెలిపారు. దీనికి దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు.