గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఏవీఎస్.రెడ్డి తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం ఇచ్చిన హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 12 నుంచి 28వ తేదీల్లో ఒక రోజును పోలింగ్ తేదీలుగా ఖరారు చేస్తామని చెప్పారు. సోమవారమే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని భావించామన్నారు.
అయితే, ఎన్నికల తేదీలను సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉన్నందున జాప్యం జరిగినట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతామన్నారు. ఓటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలైనంత ఎక్కువగా సాయుధ బలగాలను వియోగిస్తామని రెడ్డి తెలిపారు.